Wednesday, February 6, 2008

నా ఇష్టం మీ కష్టం

అదో నిశీధి రాత్రి గుంటూరు మెడికల్ కాలేజీ మెన్స్ హొస్టల్ న్యూ బ్లాక్ నెంబర్ 36.బయట వర్షం హొరు.లొపల కుర్రతనం జోరు.ఆ బలహీన క్షణం లో కలం జారాను.మొదటి సారిగా. 1980 నాటి మాట.దాని ఫలితం 'రెండు జడలు-మూడు ముళ్ళు-నాలుగు కళ్ళు ' అనే కథ కలేజీ మ్యగజైను లో అచ్చయ్యింది.(అంతే కాదు ఫస్ట్ ప్రైజు కూడా వచ్చిందని చెప్పుకోను.ఏందుకంటే మోడెస్టీ మా ఇంటి పేరు)



అప్పటినుంచి మళ్ళీ ఎన్నో బలహీనక్ష ణాలు ఎదురైనా నిభాయించుకున్నాను,నిగ్రహించుకున్నాను.కానీ చివరాఖరుకి నా క్లాస్మేట్ భార్గవి ప్రొద్బలంతో శ్రీరమణ గారి ప్రేరణతొ మరోసారి రాయక తప్పడం లేదు.



"అసలు నువ్వెవడివయ్యా ఎవడు పడ్తే వాడు రాస్తుంటే చదవడానికి మాకేం పనీపాటా లేదనుకున్నావా " అని మీరందరూ నా సెర్వికల్ స్పైన్ (సారీ అప్పుడప్పుడు మెడికల్ టరెంస్ దొర్లక తప్పదు) పట్టుకుని దులుపుతారని తెలుసు.అందుకనె ఈ ఉపొద్ఘాతమనే ముష్టిఘాతం.


నా తల్లితండ్రులు పెట్టిన ముద్దుపేరు గురవారెడ్డి.తెగ మోటు గా ఉందన్న నా కుర్రతనంలో యద్దనపుడి నవలలు చదివిన నేను నాకు చాలా స్టయిల్ గా పేర్లు ఎన్నొ రాజశేఖర్,రవి,వగైరా వగైరా.పెరుగుతున్న రొజుల్లొ బాడీ,లెగ్స్ సమపాళ్ళ పెరుగుదలలొ తెడా వచి కాళ్ళు మునక్కాడల్లా ఏదిగినపుడు గిట్టని పొట్టివాళ్ళు పెట్టిన పేరు 2:1(అంటే రెండువంతులు కాళ్ళు ఒక వంతు బాడీ అన్నమాట ).మెడికల్ కాలేజీ లో నారో పంట్స్ వేసినప్పుడు మళ్ళీ గిట్టని వాళ్ళు పెట్టిన పేరు 'గొట్టం గురవారెడ్డీ.కాలేజీ లొ అమ్మాయిలు ఎమేమి పేర్లు పెట్టారో నాకు నిజంగా తెలేదు(ఒక వేళ తెలిసినా మీ అందరితొ పంచుకొవాలని రూలేమీ లేదు) చివరిగా నా శ్రీమతి పెట్టిన పేరు గురివి(ఇదెదొ కొరివి అన్నమాటకు భావంలో,రాగం లో,శబ్దం లో దగ్గర గా ఉంటే నేనేం చేయను)

ఇక నా స్టయిల్ మహా తొందర మనిషిని.చిన్నప్పటి నుంచి అంతే.ఎంత తొందరంటే మా అమ్మ గుంటూరు లో పురిటి నొప్పులతొ హస్పిటల్ కి వెళ్ళేదాకా కుడా ఆగలేకపొయను.రిక్షాలో పుట్టేసాను.(దీన్నే మెడికల్ టెర్మినాలజీ లో ప్రెసిప్టేటె లేబర్ అంటారన్న సంగతి అప్పుడు నాకు తేలీదు)నేను పుట్టిన క్షణంలో కరెంట్పొయి గాడాంధకారం అనీ,రిక్షాటైర్ పంక్చర్ అయిందనీ,భొరున వర్షం అనీ నేను చెప్తే మెరు 'పోద్దూ మరీ అతిశయౌక్తీ అంటారని తెలుసు.కానీ నిజం.నక్కలు,తొడేళ్ళు అరుపులు కూడా వినపడ్డయని కొందరు బంధుజనం చెవులు కొరుక్కుంటున్నారు.అది వేరే సంగతి.నా బాల్యం అంతా బాపట్ల లో గడిచింది.వారి తల్లితండ్రులు సత్యనారాయణరెడ్డీ రాజ్యలక్ష్మి. మా నాన్న గారు అగ్రికుల్చురల్ కాలేజీ,బాపట్ల లో ఉద్యొగి.ఇద్దరు తమ్ముళ్ళు.ఒకడు దుబాఇలో - ఇంకొడు అమెరికా లో.భార్య ఇద్దరు పిల్లలు. మాఆవిడ డాక్టరు.బాబు మెడికల్ కాలేజీ.పాప ఇంటెర్మీడియట్.నేను గుంటూరు లో ఎం.బి.బి.ఎస్,తర్వాత పుణే లో ఆర్థొపేడిక్స్ పట్టా పుచుకున్నాను.తర్వాత 10 ఏళ్ళు ఇంగ్లాండ్ లో రాణిగారి సేవ లో.లేడీ డయాన చనిపొయిన తర్వాత ఇక ఆ దేశంలో గ్లామర్ లేదనిపించి ఇండియా కి తిరిగి రవాణా.

ప్రస్తుతం హైదరాబాదులో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జనుగా జీవితం.అరిగిన కీళ్ళు మార్పిడి.కొత్త కీళ్ళు వేయడం వౄత్తి.ఖాళీ టైం లో పాటలు వినడం,పుస్తకాలు చదవడం ప్రవౄత్తి.మీరిప్పటి దాకా గొప్ప కవుల్ని, ఇంకా గొప్ప రచయితల్నీ చదివుంటారు.కాని ఇక్కడ గొప్పతనం ఏమీలేకపొవడమే. నేను మీలో ఒక్కడిని.మీలా ఒక్కడినీ. కాబట్టి నా భావాలు,మాటలు కారుకూతలు.మీకు ఎక్కడో విన్నట్టే ఉంటుంది.

ఇక నేను ప్రతి వారం మీ అందరితో ముచ్చటిస్తాను. దేని గురించి? అని అడగద్దు. ఒకటని కాదు ఏది తోచితే దాని గురించి.ఏప్పుడూ రోగాలు,రోష్టులు గురించి మాట్లాడను.భయపడోద్దు. నా భావాలూ,అనుభవాలూ,మీతో పంచుకుందామని ప్రయత్నం.దీనికో శైలీ,శిల్పం లేవు.కథా కమామేషు అంతకంటే లేవు.సింపుల్గా చెప్పలంటే ఓ ఇద్దరు స్నేహితులు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నట్లు.శ్రిశ్రి గారన్నట్లు ఏ విషయం అయినా సరే కుక్కపిల్ల నుంచి అగ్గిపుల్ల దాకా.

'చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్న నానుడి వినే ఉంటారు.దానర్ధం వినేవాడు తెలివితక్కువ వాడు అని కాదు.చెప్పేవాడికి మాత్రం ఏమాత్రం అడ్డూ అయిపూ లేవని.నాక్కుడా శ్రిరమణ గారు అలాంటి లైసెన్సె ఇచ్చెసారు.ఇక నా ఇష్టం .మీ కష్టం .





article from NAVYA weekly dated August 1,2007.

5 comments:

Anonymous said...

నిండుగా ఆరోగ్యంగా బ్లాగారు. బ్లాగు లోకానికి స్వహ్బ్దిధ్వ్-- విహారి

రానారె said...

సూపరు!!

Winner said...

బ్లాగు లోకానికి సుస్వాగతం, ఇలాగే గురవా రెడ్డీ గారి హస్యపు జల్లులు అర అరగా అందించండి. ఇప్పుడు వస్తున్న వార పత్రికలలో నవ్య ఎంతో మేలు.

ప్రసాదం

cbrao said...

స్వాగతం.పుడతం తోటే హాస్యం మొదలయ్యిందన్నమాట.About Me లో మీ క్లుప్త పరిచయం,మీ e-mail చిరునామా ఇవ్వండి. తెలుగు బ్లాగులకు ఇప్పట్లో password verification అవసరము లేదు. ఇది, కామెంట్లు రాసేవారికి కొన్నిసార్లు చికాకు తెప్పించిన సందర్భాలు వున్నాయి. ఇది తొలగిస్తే, ఎక్కువ కామెంట్స్ పాఠకులనుంచి రాగలవు. "నా బాల్యం అంతా బాపట్ల లో గడిచింది.వారి తల్లితండ్రులు సత్యనారాయణరెడ్డీ రాజ్యలక్ష్మి." ఈ వాక్యం లో,వారి బదులుగా నా వుంచండి. తరువాయి భాగం కోసం ఎదురు చూస్తాము.

సిరిసిరిమువ్వ said...

బ్లాగు లోకానికి స్వాగతం. నవ్య వీక్లీలో గురవారెడ్డి గారి కాలం ప్రతి వారం తప్పకుండా చదువుతాను. ఓ మంచి చేయి తిరిగిన హాస్య రచయితలా తన కాలంలో హాస్యపు జల్లులు కురిపిస్తారు గురవారెడ్డి గారు. ఆయన రచనలిని మీరు బ్లాగుకి ఎక్కించటం చాలా ఆనందదాయకం.